జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి(APR 10) సందర్భంగా ఎల్లుండి మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. మటన్, బీఫ్ ఇతర మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు. అహింసను పాటించే జైన మతస్తుల మనోభావాలను గౌరవిస్తూ వ్యాపారులు మాంసం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేయాలని సూచించారు.
మహవీర్ జయంతి జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది జైన మతం యొక్క 24వ, చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకుంటారు. ఈ పండుగ రోజున మహావీరుడు బోధించిన అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్యం, అపరిగ్రహ అనే ఐదు సూత్రాలను ప్రజలు స్మరించుకొని ఆచరిస్తారు. జైనులు మహవీర్ జయంతి రోజున ప్రత్యేక ప్రార్థనల చేస్తారు. మహావీరునికి తమ భక్తిని చూపించడానికి జైన దేవాలయాలను సందర్శిస్తారు. మహావీరుని విగ్రహాన్ని ఊరేగింపుగా రథంపై తీసుకువెళతారు. దీనిని రథ యాత్ర అని పిలుస్తారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు.