సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ లో ఊరట దక్కకపోవడంతో తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు. ఐదుగురు సివిల్ సర్వీసెస్ అధికారులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. డీవోపీటీ ఆదేశాలు ఫైనల్ కాదని.. హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని ఐఏఎస్ ల తరపు న్యాయవాదులు చెప్పారు. గతంలో డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆమ్రపాలి సహా ఏడుగురు అధికారులు ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే క్యాట్ తీర్పును హైకోర్టులో సవాల్ చేసి.. తీర్పు అనంతరం రిపోర్ట్ చేయాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్‌లను తిరిగి ఏపీకి వెళ్లాలని.. ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు తెలంగాణ వెళ్లాలని డీవోపీటీ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, ఏపీలో పని చేస్తోన్న తెలంగాణ కేడర్ అధికారిని సృజన డీవోపీటీ ఆదేశాలను క్యాట్‌లో సవాల్ చేశారు. సొంత కేడర్ స్టేట్లకు వెళ్లాలన్న డీవోపీటీ ఆదేశాలను రద్దు చేస్తూ.. తమను ప్రస్తుతం పని చేస్తోన్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని వేర్వేరుగా క్యాట్‌కు విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం డీవోపీటీ వాదనలతో ఏకీభవించింది. డీవోపీటీ ఆదేశాల ప్రకారం ఐఏఎస్ అధికారులు సొంత కేడర్ రాష్ట్రాలకు వెళ్లాలని క్యాట్ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో క్యాట్ తీర్పుపై అధికారులు ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించారు.