BACK BENCHERS: తెలంగాణ స్కూళ్లలో ఇక నో బ్యాక్ బెంచర్స్..!
ట్రెండ్ సెట్ చేస్తున్న మళయాళ చిత్రం... తెలంగాణలోనూ నో మోర్ బ్యాక్ బెంచర్స్.. అమలు దిశగా కరసత్తు చేస్తున్న ప్రభుత్వం..!;
సినిమాలు చూసి జనం మారుతారా! అని అంటుంటారు. మంచి సందేశాన్ని చెప్పాల్సిన తీరులో చెబితే కచ్చితంగా మారుతారని కేరళ పాఠశాలలు రుజువు చేశాయి. మలయాళంలో ఇటీవల విడుదలై విద్యార్థుల సమస్యలపై చర్చకు తెర లేపిన 'స్థానార్థి శ్రీకుట్టన్' చిత్రం రాష్ట్రంలోని చాలా పాఠశాలల తరగతి గదుల్లో మార్పు తీసుకొచ్చింది. ఆ సినిమా స్పూర్తితో పాఠశాలలో బ్యాక్ బెంచీలు మాయం అయిపోతున్నాయి. విద్యార్థులందరూ 'యూ' ఆకారంలో కూర్చొంటున్నారు. ఇప్పుడు ఇదే పద్ధతిని తెలంగాణలోని స్కూళ్లలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అసలు 'నో మోర్ బ్యాక్ బెంచర్స్' అంటే ఏమిటి? దీన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనాలేంటి? విద్యార్థులకు కలిగి లాభాలు? తదితర విషయాలు ఈటీవీ భారత్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ మూవీ స్ఫూర్తితో హైదరాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో U ఆకారం సీటింగ్ అమలు చేయాలని తాజాగా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని క్లాసుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇది సక్సెస్ అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. త్వరలోనే బ్యాక్ బెంచ్ సీటింగ్ కు స్వస్తి చెప్పి యూ టైప్ సీటింగ్ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
'నో మోర్ బ్యాక్ బెంచర్స్' అంటే..
'నో మోర్ బ్యాక్ బెంచర్స్' అంటే తరగతి గదిలో ఒక బెంచీ వెనుక ఒకటి వేయకుండా విద్యార్థులందర్నీ 'యూ' ఆకారంలో కూర్చొబెట్టడం. అంటే క్లాస్ రూమ్‌లో బ్యాక్ బెంచ్‌లు ఉండవన్నమాట. దీంతో ఏ విద్యార్థినీ ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయరు. అందరూ టీచర్‌కు కనిపిస్తారు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను సరిగ్గా వినగలుగుతారు. అలాగే స్టూడెంట్ ఏం చేస్తున్నాడో టీచర్‌కు తెలుస్తుంది. విద్యార్థులందరూ 'యూ' ఆకారంలో ఒకే చోట కూర్చుంటే, ఉపాధ్యాయుడు వారి మధ్యలో నిలబడి బోధిస్తారు.
మరోవైపు 'నో మోర్ బ్యాక్ బెంచర్స్' విధానంపై విద్యార్థులు సైతం ప్రశంసలు కనబరుస్తున్నారు. ఈ విధానం వల్ల టీచర్స్ చెప్పే పాఠాలు చక్కగా వినగలమంటున్నారు. అక్రురామోని కోరోనేషన్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న సంపద ముఖర్జీ ఇదే విషయంపై స్పందించింది. "నేను చిన్నప్పటి నుంచి క్లాస్ రూమ్‌లో ముందు బెంచీలపై కూర్చోవడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, ఫ్రంట్ బెంచీల్లో కూర్చొంటే టీచర్స్ చెప్పే పాఠాలు బాగా వినగలను. చదువుపై దృష్టి పెట్టగలను. ప్రస్తుతం విద్యా సంస్థల్లో బ్యాక్ బెంచర్స్ అనే పదం పాపులర్ అయిపోయింది. ఈ విధానం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.