BJP: సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న బీజేపీ
ప్రధాని మోదీ కులంపై వ్యాఖ్యలపై ఆగ్రహం... రేవంత్ కు పోయే కాలం వచ్చిందన్న ఈటల;
ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల పట్ల బీజేపీ ఫైర్ అయ్యింది. సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.1994లోనే గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీలో చేర్చిందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన వారో రేవంత్ చెప్పాలని ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ నేతలంతా కౌంటర్ ఇస్తున్నారు. మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు సరికాదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని.. అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
సీఎం రేవంత్‌పై ఈటల షాకింగ్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పోయేకాలం దగ్గర పడిందన్నారు. మోదీని తిడితే ఏం జరుగుతుందో కేసీఆర్‌కు తెలిసింది.. త్వరలో రేవంత్ రెడ్డికి కూడా తెలుస్తుందన్నారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు మోదీని పెద్దన్న అంటారు.. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా సీఎం వ్యాఖ్యలకు ఈటల సహ బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
రేవంత్, కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గత పదేళ్లుగా కేంద్రం ఏం చేసిందని రేవంత్, కేసీఆర్ అంటున్నారు. ఇద్దరు కలిసి రండి.. కేంద్రం ఏం చేసింది చూపిస్తాం. గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీనిపై చర్చించేందుకు రేవంత్, కేసీఆర్ సిద్దమా? రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మోదీ వస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు’. అని వ్యాఖ్యానించారు.'