BRS : ఉప ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ ఖతమే ... బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఆ నలుగురే : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కేటీఆర్ మాట్లాడితే ఉప ఎన్నికలు అంటున్నాడని, ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా కనుమరుగైపోతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కుటుంబం పై కోపంతో కాంగ్రెస్ సర్కార్ ఏలాంటి సంక్షేమ పథకాలను పక్కన పెట్టలేదని, మీపై కోపంతోనే రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ను అధికారంలో నుంచి పక్కన పెట్టారని సెటైర్ వేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఆ నలుగురేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే రాష్ట్రంలో పాదయాత్ర చేసి చేసి, మీ అవినీతి అక్రమాలను బయటపెట్టి బీఆర్ఎస్ ను గద్దెదించాడన్నారు. అవినీతి, అక్రమాలకు బతుకమ్మ చీరల పథకం అడ్డుగా పెట్టుకొని, నేతన్న బతుకులతో ఆడుకున్నావని మండిపడ్డారు. నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చి రూ.197 కోట్ల బకాయిలు పెట్టింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. 7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించామన్నారు. హైడ్రాతో కబ్జాలకు గురైన నాళాలు, చెరువులను కాపాడుతున్నామన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు స్కీముల్లో చేసినవన్నీ స్కాములేనని, జిల్లాలో జరిగిన అవినీతి అక్రమాలు, అవకతవలు బయటపెడతామని సవాల్ విసిరారు. కేటీఆర్ మాటలు రోజురోజుకు కోటలు దాటుతున్నాయని, అధికారం పోయిన పొగరు, అహంకారం మాటలు ఇంకా మారాలేదన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ తన వైఖరి మార్చుకొని ప్రజల కోసం పోరాడాలని సూచించారు.