REVANTH: అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం
శాసనసభ మండలిలో రేవంత్ ఆగ్రహం... సుదీర్ఘంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి;
గతంలో ఎన్నికల కోడ్ సాకుతో కేసీఆర్ రైతు బంధు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మండలిలో సుదీర్ఘంగా ప్రసంగించిన రేవంత్.. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా రికార్డు స్థాయిలో పంట పండిందని తెలిపారు. దేశంలో అత్యధికంగా వడ్లు ఉత్పత్తి చేసిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో కట్టింది కాళేశ్వరం కాదని.. కూలేశ్వేరమని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వర్క్ ఫ్రం ఫామ్ హౌజా.. ?
తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 15 నెలల పాటు సభకు రాకున్నా కేసీఆర్ జీతభత్యాలు పొందుతున్నారని రేవంత్ అన్నారు. ఈ 15 నెలల్లో కేసీఆర్ రూ. 57 లక్షల జీతం తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ వర్క్ ఫ్రం ఫామ్ హౌజా.. అని రేవంత్ ప్రశ్నించారు. నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ.. నిద్ర నటించే వాడిని లేపలేమని రేవంత్ అన్నారు.
ఢిల్లీకి వెళ్లేది గోలీలు ఆడుకోడానికి కాదు
ఢిల్లీ పర్యటనల పేరుతో ఎలాంటి దుబారా ఖర్చు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్.. అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికి 32 సార్లు ఢిల్లీ వెళ్లానని.. రానున్న రోజుల్లో 300సార్లు వెళ్తానన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డిని నాలుగుసార్లు కలిశానని తెలిపారు. ప్రధాని ఏ రాష్ట్రానికి అయినా పెద్దన్న లాంటి వాడని... కేంద్రంతో సత్సంబంధాలు నెరపాల్సి ఉందని రేవంత్ అన్నారు. ప్రధానిని గౌరవించే విజ్ఞత తమదని స్పష్టం చేశారు.
ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పార్టీలు నడవవు
ఫామ్ హౌజుల్లో కెసినోలు, డ్రగ్స్ పార్టీలు నడవబోవని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. దీపావళి రోజున ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ పార్టీలు చేసుకుంది ఎవరని సీఎం ప్రశ్నించారు. దుబాయ్ లో డ్రగ్స్ తీసుకుని చనిపోయింది ఎవరని రేవంత్ నిలదీశారు. దుబాయ్ నుంచి అన్ని వివరాలు తెప్పించామని వెల్లడించారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా చేస్తామని రేవంత్ వెల్లడించారు.