రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ విజిట్‌ను అధికారులు చేయాలని, ఆడిటింగ్ నిరంతరం జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటివారైనా ఉపేక్షించకుండా, నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు.
రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. గతేడాది వచ్చిన
ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహారించాలని అధికారులను రేవంత్ హెచ్చరించారు.
గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్‌లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవటానికి కారణాలపై సిఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ, అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం ఎందుకు పెరగలేదని ఈ సందర్భంగా సిఎం రేవంత్ అధికారులను ప్రశ్నించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ, విక్రయాల ధరలకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమని అధికారులు సిఎంతో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, ఇప్పటికీ చాలాచోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని అధికారులు సిఎం రేవంత్‌తో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని, ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.