CM : భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో...అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండడంతో పాత ఇళ్లలో నివసిస్తున్న వారిని... ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అలాగే, లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వారిని ముందస్తుగా తరలించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, ట్రాఫిక్, పోలీసు అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి విపత్తులు సంభవించినా త్వరితగతిన స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.