Telangana Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నయా యాక్షన్ ప్లాన్..
తెలంగాణలో త్వరలో జరగబోయే 117 మున్సిపాలిటీలు ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ల ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. గత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా టార్గెట్లు ఇచ్చి మరి మెజార్టీ సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి వారికి స్పెషల్ టాస్కులు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. లోకల్ గా ఉండే నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంతోపాటు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అనేది సర్వేల ద్వారా తెలుసుకొని వారిని ఎంకరేజ్ చేయాలని సీఎం రేవంత్ గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే సీనియర్ మంత్రులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ వీక్ గా ఉందో అక్కడ మంత్రులు బలంగా ప్రచారం చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు.
రెబల్స్ ను బుజ్జగించడం, అర్హులను గుర్తించడం.. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడం చూసుకుంటున్నారు మంత్రులు. ఎక్కువమంది రెబల్స్ పోటీకి దిగకుండా మంత్రులు వారిని బుజ్జగించడంతోపాటు పార్టీపరమైన హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్గత సర్వేల ఫలితంగా టికెట్ రాని వారిని పార్టీ లైన్ దాటిపోకుండా చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మంత్రులు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటూ ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక వర్గాలతో మీటింగులు, మున్సిపాలిటీలో కలిసిన గ్రామాల్లో మీటింగులు పెట్టి ఆయా గ్రామాలకు ప్రత్యేకంగా హామీలు ఇచ్చి కాంగ్రెస్ కు ఓటు వేసేలా గ్రామ తీర్మానాలు కూడా చేసుకుంటున్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే మంత్రులకు ఇతర జిల్లాల్లో బాధ్యతలు అప్పగించారు. ఎవరు ఎక్కువ సీట్లు గెలుచుకొని వస్తే వారికి ప్రభుత్వంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట టాస్కులు బలంగానే ఉన్నాయంట. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు.. సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల కోసం ఏమేం చేస్తున్నారో చెబుతూ ప్రచారాలకు స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ఎక్కువగా ఎమ్మెల్యేల చేతుల మీదనే నడిచాయి. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఎక్కువగా మంత్రుల బాధ్యతగా తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కువ సీట్లు సాధించినట్లు మంత్రులు కూడా అదే స్థాయిలో సాధిస్తారా లేదా అనేది వేచి చూడాలి.