Court: బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు కేసుపై సుప్రీంకోర్ట్
రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదం తెలిపే విషయంలో గడువు విధించాలన్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కొంతకాలంగా ఈ కేసుపై వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపించాయి. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనలను వ్యతిరేకిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. చివరిగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
వివరణ కోరిన రాష్ట్రపతి గతంలో ఏప్రిల్ 8న తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా నిలిపివేయడం సరికాదని తీర్పు ఇచ్చింది. 415 పేజీల తీర్పులో గవర్నర్లు, రాష్ట్రపతి బిల్లులపై గరిష్టంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని లేదా తిప్పి పంపాలని పేర్కొంది. తిప్పి పంపడానికి కారణాలను కూడా వివరించాలని తెలిపింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని అధికరణం 143(1) కింద సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరారు. న్యాయస్థానం తనను అలా ఆదేశించవచ్చా అని ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది.
రాష్ట్రాల వాదనలు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనల్లో, ఏడో షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితా అంశాలపై వచ్చిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడానికి వీల్లేదని పేర్కొంది. రాజ్యాంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భాల్లో తప్ప.. గవర్నర్ మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలని, విచక్షణాధికారాలు ఉపయోగించకూడదని వాదించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు కూడా తమ వాదనలను వినిపించాయి. ఈ కేసుపై తుది తీర్పు వెలువడిన తర్వాత గవర్నర్ల అధికారాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.