తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి
తెలంగాణలో రెండు మూడు నెలల పాటు ఎన్నికల హడావుడి ఉండనుంది.;
తెలంగాణలో రెండు మూడు నెలల పాటు ఎన్నికల హడావుడి ఉండబోతోంది. ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తరువాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో ఆ జోష్ ను కొనసాగించాలని భావిస్తోంది కమలదళం. మరింత దూకుడుగా పార్టీ విస్తరణకు కృషి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ వరుస పర్యటనలతో కేడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు .
హైదరాబాద్ కే పర్యటనలు పరిమితం చేయకుండా.. జిల్లా పర్యటనలకు వెళ్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. మరోమారు ఆయన రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారని అంటున్నాయి పార్టీ వర్గాలు.
మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ సిర్పూర్ కు వెళ్ళనున్నారు తరుణ్ చుగ్. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేత పాల్వాయి హరీష్ కు పార్టీలో చేర్చుకోనున్నారు. పాల్వాయి హరీష్ కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో పోటీచేసి ఓడిపోయారు. అనంతరం జిల్లా కేడర్ తో సమావేశం కానున్నారు .
రేపు హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు జాతీయ నాయకులతో ప్రదాని మోదీ సమావేమై పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీసుకు వస్తున్న కొత్త చట్టాలను ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలి.. భవిష్యత్ లో వీటి వల్ల కలిగే లాభాలను ప్రజలకు ఎలా వివరించాలన్న దానిపై రాష్ట్ర పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు తరుణ్ చుగ్.
రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా నేతలకు సూచించనున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలో చేరేందుకు అనేక మంది ఉత్సాహం చూపిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఆయన నాగార్జున సాగర్ నియోజక వర్గంలో పార్టీ కేడర్ తో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నేతలు పార్టీ తీర్థం పుచ్చకోనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. వీరి చేరికతో పార్టీ కి మరింత బలం పెరిగే అవకాశం ఉందంటున్నారు.
తరుణ్ చుగ్ పర్యటన నేపథ్యంలో బీజేపీలో వివిద నియోజక వర్గాల వారు చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీలో చేరే నేతలు ఎవరు.. ఏ పార్టీల నుండి రాబోతున్నారన్నది సస్పెన్స్ అంటున్నారు ఆ పార్టీ నేతలు.