ఆక్రమణదారులను హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) హడలెత్తిస్తున్నది. పర్మిషన్ లేని నిర్మాణాలు, బఫర్ జోన్, చెరువులను ఆక్రమించి ఎఫ్ టీఎల్ పరిధిలో నిర్మించిన బిల్డింగ్ లను నేలమట్టం చేస్తూ కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఎమ్మెల్యేలు, బడాబాబులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నా.. హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. హైడ్రా పనితీరును సిటీజనం స్వాగతిస్తున్నారు. తమకు తెలిసిన అక్రమ కట్టడాలు, ఆక్రమణల గురించి హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే, హైడ్రా కూల్చివేతలను అవకాశంగా తీసుకొని కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా పేరు చెప్పి నిర్మాణ దారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను కాపాడటం, విపత్తు సమయాల్లో సహాయక చర్యలు చేపట్టడం హైడ్రా ప్రధాన పని. అందుకు తగ్గట్లుగానే కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా దూకుడుగా పనిచేస్తోంది. ఇదే టైమ్ అనుకుని కొన్ని చోట్ల మాత్రం అధికారులు అడ్డదారులు తొక్కతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా పేరు చెప్పి అక్రమనిర్మాణదారులు, బడాబాబుల దగ్గర.. అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు,కార్పొరేటర్లు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడ తమ నిర్మాణాలను కూల్చివేస్తారోనని భయపడి అవతలి వ్యక్తులు కూడా అడిగినంత డబ్బు ముట్టచెబుతున్నట్లు సమాచారం.