GOLD ATM: పసిడి లావాదేవీలకు ఆల్ ఇన్ వన్ గోల్డ్ ఏటీఎం
క్షణాల్లో బంగారాన్ని కొనే గోల్ మెల్డింగ్ ఏటీఎం... బంగారం అమ్మడమూ సులభమే అన్న గోల్డ్ సిక్కా సంస్థ;
బంగారాన్ని అమ్మాలనుకునే వారికి ఇక నుంచి బంగారం షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేసే ‘గోల్డ్ మెల్టింగ్ ఏటీఎం’ ను హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌సిక్కా సంస్థ తీసుకువచ్చింది. ఇప్పటికే బంగారం కొనుగోలుకు ఏటీఎంను మూడు సంవత్సరాల క్రితమే ప్రవేశపెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు పాత బంగారాన్ని విక్రయించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యంత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురానుంది. సాధారణంగా పాత బంగారాన్ని విక్రయించే ప్రక్రియలో అనేక దశలు, మధ్యవర్తులు, ఖర్చులు, మోసపూరిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా గోల్డ్‌సిక్కా సంస్థ ఈ ఆధునిక యంత్రాన్ని అభివృద్ధి చేసింది. వినియోగదారులు తమ పాత బంగారాన్ని ఈ యంత్రంలో ఉంచితే, ముందుగా బంగారపు వస్తువు ధ్రువీకరణ జరుగుతుంది. ఆ తరువాత యంత్రం ఆ బంగారాన్ని కరిగించి, దాని స్వచ్ఛతను పరీక్షించి, ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా విలువను సూచిస్తుంది. ఈ విలువను వినియోగదారు అంగీకరిస్తే, వారి ఎంపిక మేరకు నగదు లేదా కొత్త బంగారం పొందే అవకాశం ఉంటుంది. నగదు తీసుకునే వారు తమ బ్యాంక్ ఖాతాలోకి సుమారు 30 నిమిషాల్లో డబ్బు జమవుతుందని సంస్థ తెలిపింది. అలాగే, నగదు అవసరం లేనివారు అదే విలువకు తగిన కొత్త నగలతో మార్పిడి చేసుకోవచ్చు.
పూర్తిగా సురక్షితం
పాత బంగారాన్ని విక్రయించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యంత్రం పూర్తిగా సురక్షితంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఆధార్ ఆధారిత ధృవీకరణ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.