ఒక రైతుకైనా సన్నరకం వడ్లకు బోనస్ వచ్చిందా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైందని హరీశ్‌రావు తెలిపారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్‌ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నామన్నారు. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారని గుర్తు చేశారు. మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని, గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదని అన్నారు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వమని మోసం చేశారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని మోసం చేశారు. రూ.12,000 రైతు కూలీలకు ఇస్తామని మోసం చేశారు. రూ.500 బోనస్ ఇస్తామని కూడా మోసం చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాడడమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరగం వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని హరీశ్‌రావు తెలిపారు.