తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. పార్ట్ టైం ఉద్యోగులు, సభ్యులతో అసోసియేషన్ కార్యాకలాపాలు కొనసాగించడాన్ని సవాలు చేస్తూ కబడ్డీ కోచ్ పవన్ కుమార్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ విచారణ చేపట్టగా.. అసోసియేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉండటం వల్ల క్రీడాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. అసోసియేషన్ కార్యకలాపాలపై ఎంక్వెరీ జరిపించాలని కోరారు. కాగా అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్.. అసోసియేషన్ల నిర్వహణలో ప్రభుత్వాల పాత్ర పరిమితమని కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నేషనల్ స్పోర్ట్స్ కోడ్...2011ను అమలు చేయకపోవడం పై వివరణ ఇవ్వాలని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.