తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ పథకం సర్వే ముమ్మరంగా సాగుతోంది. సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి పథకం కోసం అప్లయ్ చేసుకున్న వారి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అయితే యాప్‌లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా.. లేదా..? అని తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సూపర్ చెక్ చేయనున్నారు. సర్వే పూర్తయిన 5 శాతం ఇళ్లలో మళ్లీ సర్వే చేయనున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది.
మెుత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు చొప్పున మంజురూ చేయనున్నారు. సొంత జాగా ఉన్న నిరు పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 లక్షల 54 వేల 554 అఫ్లికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు 68 లక్షల 57 వేల 216 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించారు. సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో ఐదు శాతం అంటే దాదాపు 4 లక్షలు దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.