Telangana : తెలంగాణలో తీసుకొచ్చిన గృహజ్యోతి (Gruha Jyothi) పథకానికి సంబంధించి కీలక సూచనలు చేసింది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకానికి అర్హులు కావాలంటే ముందుగా ఆధార్ వివరాలను అందించాలి. ఆధార్ కార్డు ఉంటేనే గృహ జ్యోతి పథకానికి లబ్దిదారులు అవుతారని తేల్చి చెప్పింది.
శుక్రవారం రాత్రి రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని క్షేత్ర స్థాయిలో డిస్కంలు అమలు చేస్తాయని తెలిపింది. లబ్ధిదారులు ఆధార్ నంబర్ తప్పకుండా కలిగి ఉండాలి. ఆధార్ నంబర్ లేనివారు లేదా ఇంకా ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకోని వారు పథకం కోసం నమోదు చేసుకునే ముందు ఎన్‌రోల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆధార్ చూపించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌ను తీసుకుంటారని, అది పనిచేయకుంటే ఐరిస్‌ను స్కాన్ చేస్తారని తెలిపింది. అదీ కూడా సాధ్యం కానీ పక్షంలో ముఖాన్ని ఫొటో తీసుకుంటారని వివరించింది. ఇవన్నీ కూడా సాధ్యం కాకపోతే లబ్ధిదారుడి ఆధార్ క్యూఆర్ కోడ్ సహాయంతో వివరాలు తెలుసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్స్ ను కూడా పెంచుతోంది ప్రభుత్వం. UIDAI యొక్క ప్రస్తుత రిజిస్ట్రార్‌ల సమన్వయంతో లేదా UIDAI రిజిస్ట్రార్‌గా మారడం ద్వారా అనుకూలమైన ప్రదేశాలలో దీని కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధార్ లేకపోతే ఆధార్ వచ్చే వరకు వరకు, ఫోటోతో కూడిన బ్యాంక్ లేదా పోస్టాఫీసు పాస్‌బుక్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, MGNREGA కార్డ్, కిసాన్ ఫోటో పాస్‌బుక్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు ధృవీకరణ పత్రం (ఫోటోతో) అధికారిక లెటర్ హెడ్‌పై గెజిటెడ్ అధికారి లేదా తహశీల్దార్ సంతకం కావాల్సి ఉంటుంది. ఇంధన శాఖ నుంచి ఇతర పత్రం ఇవ్వొచ్చు.