Huzurabad By Poll: డబ్బులు పంచడానికి పోటీలు పడుతున్న ప్రధాన పార్టీలు..
Huzurabad By Poll: ఇంటింటికి వెళ్లి మరీ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తూ ఓటర్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది.;
Huzurabad By Poll: హుజురాబాద్‌లో ప్రచార పర్వం ముగిసిన తర్వాత.. ప్రలోభాల పర్వం ఊపందుకుంది. గెలుపే లక్ష్యంగా నేతలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ డబ్బులు కవర్లలో పెట్టి ఇస్తూ ఓటర్‌ను ప్రసన్నం చేసుకుంటున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఒక్కో ఓటుకు ఆరు వేల రూపాయల వరకు ఇవ్వడం, ఆ వీడియోలు బయటకు రావడం కూడా జరిగింది. డబ్బు పంచడానికి పార్టీలు పోటీపడడంతో.. ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉంటే కవర్ బరువు అంతలా పెరుగుతోంది.
మరోవైపు ఓటుకు... 20 వేలకు పైగా ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా, ఆ పని బీజేపే చేస్తోందని టీఆర్‌ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఓటర్లకు వేలకు వేలు పంచుతుండడంతో.. డబ్బులు రానివాళ్లు రోడ్డెక్కుతున్నారు.
హుజురాబాద్ మండలం కాట్రపల్లి, పెద్ద పాపయ్యపల్లి, రాంపూర్ గ్రామాల సర్పంచ్‌ల ఇంటిముందు ఓటర్లు ఆందోళనకు దిగారు. తమకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జమ్మికుంట, వీణవంక, ఇళ్లందుకుంట, కమలాపూర్ గ్రామాల్లో కూడా డబ్బులు రానివాళ్లు ఆందోళనలకు దిగారు.
మరోవైపు పోలీసులు చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నా డబ్బుల పంపిణీ ఆగడం లేదు. ప్రలోభాలను అడ్డుకునేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీసు బృందాలు గ్రామాలకు వెళ్లి చెకింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3 కోట్ల 29లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.