హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో కొద్ది గంటల్లోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడి కేసులో నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనకు కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కలెక్టర్ పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం పట్నం నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.
జైలు నుండి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అన్నారు. పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. కేటీఆర్ గురించి తాను ఏం చెప్పలేదని..రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. తన అడ్వకేట్ కోరితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారన్నారు పట్నం నరేందర్‌రెడ్డి.
మరోవైపు.. చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడి కుట్ర కేసులో నిన్న నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలులో ఉన్న ఆయనతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. నరేందర్ రెడ్డికి ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డితోపాటు ఇతర నేతలు ఉన్నారు.