VC Sajjanar : బస్సు దిగే సమయం వచ్చింది: ఇక కొత్త మార్గంలో నా పయనం...వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్...
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నగరంలో శాంతిభద్రతల నిర్వహణకు కృషి చేస్తామని సీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సజ్జనార్ ప్రకటించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతేకాక, రౌడీషీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని గట్టిగా హెచ్చరించారు. నగర ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పించే దిశగా తన కృషి చేస్తామని తెలిపారు సజ్జనార్.
కాగా గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సజ్జనార్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు.ఆర్టీసీ ఎండీగా నాలుగేళ్లు సేవలు అందించడం తనకు సంతృప్తినిచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. సమష్టికృషితో సంస్థలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ తన 'ఎక్స్' ఖాతాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు సజ్జనార్. "నా స్టాప్ వచ్చేసింది. బస్సు దిగి, కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు. కానీ రహదారి ఎళ్లప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది" అని తన పోస్ట్ లో ఆయన పేర్కొన్నారు.