TG High Court : జగన్ అక్రమాస్తుల కేసు.. వాన్‌పిక్ పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఛార్జిషీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసు ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణలో ఉంది. వాన్‌పిక్ ప్రాజెక్టును మొదట సీబీఐ తన ఛార్జిషీట్‌లో చేర్చింది. 2022 జూలైలో వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే వాన్‌పిక్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందని సీబీఐ సుప్రీంకోర్టులో వాదించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు
సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, మరోసారి పిటిషన్‌పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వాన్‌పిక్ ప్రాజెక్టుపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం, చివరికి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనితో ఈ కేసులో వాన్‌పిక్ విచారణ కొనసాగనుంది.