KAMAREDDY: కామారెడ్డి కకావికలం
కామారెడ్డి జిల్లాలో కుండపోత... గ్రామాలను ముంచెత్తిన వరద;
కామారెడ్డి జిల్లా జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలతో జన జీవనం స్తంభించిపోయింది. వర్షం ధాటికి అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా బీబీపేట నుండి కామారెడ్డి వరకు వెళ్లే మార్గంలో వరద నీరు వంతెనను ధ్వంసం అవ్వడం వల్ల రోడ్డు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. క్యాసంపల్లి శివారులో, జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై వరద నీటి ప్రభావం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా నిజామాబాద్ వైపు వాహన రాకపోకలకు గట్టి సమస్యలు ఎదురయ్యాయి. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఈక్రమంలో డోంగ్లి మండలంలోని సిర్పూర్, హాసన్ టాక్లి, పెద్దటాక్లి గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పొరుగు గ్రామాల్లోని తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకున్నారు. పెద్ద టాక్లీలోని కొన్ని కుటుంబాలు డోంగ్లి మండల కేంద్రానికి వెళ్లాయి. సిర్పూర్లో 246, పెద్దటాక్లిలో 190, హాసన్ టాక్లిలో 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికంగా వరద రావడంతో పోచారం ప్రాజెక్టు కట్ట కోతకు గురైంది. వరద అధికంగా రావడంతో అలుగు సమీపంలో కట్ట కోతకు గురి అయిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దానితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేయిస్తామని పేర్కొన్నారు. పోచారం జలాశాయానికి భారీగా వరద పోటెత్తడంతో మెదక్, బోధన్ ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో మార్గం నుంచి వాహనాలు ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కామారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వేల ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేశారు.