హైదరాబాద్ కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ఐలమ్మ స్పూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రవీంద్రభారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతి క శాఖ, సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం చాకలి ఐలమ్మ నృత్య రూపకం ప్రదర్శించి నివాళులు అర్పించింది. ఈ కార్యక్రమంలో చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సీఎం సన్మానించారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు రేవంత్ రెడ్డి. దుర్మార్గాలు, అవినీతిపై పోరాటం సాగించిన వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
ఆనాడు తెలంగాణలో దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు, పీడిత వర్గాలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేసిందన్నారు రేవంత్. చాకలి ఐలమ్మ స్పూర్తితోనే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తెచ్చారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణలో పదేళ్ల పాటు పాలన సాగించిన బీఆర్ ఎస్ నేతలు ధరణి ముసుగులో పేదల భూములను గుంజుకునే కుట్ర జరిగిందని ఆరోపించారు. పేదల భూములను కాపాడేందుకే చాకలి ఐలమ్మ స్పూర్తితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్.