మూసీ తీరంలోని బాపూఘాట్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాపూఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. బాపూఘాట ను సోదర సౌభ్రాతృత్వానికి సంకేతంగా, ప్రపంచ శాంతికి చిహ్నంగా అటు అధ్యాత్మికంగా, ఇటు విద్యాబోధన కేంద్రంగా రూపొందించాలని సీఎం నిర్ణయించారు. అటు ఉస్మాన్ సాగర్, ఇటు హిమాయత్ సాగర్ నుంచి వచ్చే మూసీ, ఈసా నదుల సంగమ ప్రాంతంలో బాపూఘాట్ ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని గాంధీ సరోవర్ గా అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.