సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ -1 పరీక్షల విషయంలో బీఆర్‌ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు. నిజామాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక మక్కువ ఉందని, జిల్లాకు అత్యధికంగా కేటాయించిన నామినేటెడ్ పోస్టులే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవాలన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణం చేశారని, కేసీఆర్ హయంలో ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. వారు చేసిన అప్పులకు నెలకు 6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని, ఎంత భారం అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తుందన్నారు. కేసీఆర్ ఒక నియంతల పరిపాలించారని, కాబట్టే ప్రజలు సరైన బుద్ధి చెప్పారని విమర్శించారు.