తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. హైదరాబాద్ నగరంలోనూ మరో వారం రోజులపాటు చల్లటి వాతావరణంతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది.
ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్టు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది.ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
మరోవైపు భారత వాతావరణ శాఖ అన్నదాతకు చల్లని కబురు చెప్పింది. ఏ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా రానున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది.