తెలంగాణలో కొత్త బ్రాండ్ల బీర్లు రానున్నట్లు తెలుస్తోంది. తమ కంపెనీకి చెందిన ప్రముఖ బీర్ బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సోం డిస్టిలరీస్ అనే కంపెనీ NSEకి లేఖ రాసింది. దీంతో పవర్ 10000, హంటర్ స్ట్రాంగ్, వుడ్ పెకర్, బ్లాక్ ఫోర్ట్ బీర్లు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ అప్లై చేసుకోలేదని మే 21న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చెప్పారు.
కాగా, కొత్త బ్రాండ్ బీర్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కీలక కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని.. తాము పరిశీలించలేదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్ పెట్టిందని.. పెండింగ్ బిల్లుల వల్లే కంపెనీలు ఎక్కడైనా బీర్లు సప్లయ్ చేయకపోయి ఉండవచ్చు తప్ప మద్యం కృత్రిమ కొరత లేదన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీరు బ్రాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.