Numaish 2024: నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్..
ఈసారి నుమాయిష్‌కు మాస్క్ మస్ట్
హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నుమాయిష్‌కు సర్వం సిద్ధం చేసింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశనలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపారవేత్తలు స్టాళ్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకూ 45 రోజుల పాటు కొనసాగనుంది. 1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు... అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నిర్వహించారు. అప్పుడు 50 స్టాళ్లతో ప్రారంభమైన ఎగ్జిబిషన్... ఆ తర్వాత దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా పేరుగాంచింది. దేశనలుమూలల నుంచి వ్యాపారులు, వృత్తి కళాకారులు... తమ ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖల సమన్వయంతో పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కొత్త అధ్యక్షుడిగా పరిశ్రమల శాఖ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియమితులయ్యారు. నుమాయిష్ చరిత్రలో తొలిసారిగా శాఖాహార రెస్టారెంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫాస్ట్ ఫుడ్‌కు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 2019లో నుమాయిష్ ప్రదర్శనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి.. వందల స్టాళ్లు కాలి బూడిదయ్యాయి. ఈసారి జింక్ రూప్ ఏర్పాటు చేసి.. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. కరోనా వేరియంట్ జేఎన్-1 దృష్ట్యా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా వినోద ఉద్యాన వనం ఏర్పాటు చేస్తున్నారు.
నుమాయిష్ ప్రదర్శన కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తున్న దృష్ట్యా... భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.