RAIN: వరంగల్‌లో వర్ష బీభత్సం... వరదల్లో బస్సులు
అకాల వర్షానికి వరంగల్ అతలాకుతలం.. చెరువులను తలపించిన రహదారులు.. వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
అకాల వర్షానికి వరంగల్ నగరం తడిసి ముద్దయింది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి భారీ వరదలు వరంగల్ నగరాన్ని షేక్ చేశాయి. వరద నీటిలో బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బస్సు సగం వరకు మునిగేలా వరద నీరు నిలిచి పోయింది. దీంతో ప్రయాణికులను కిందికి దింపి తాళ్ల సహాయంతో నీళ్లనుంచి బయటకు తీసుకు వచ్చారు ఇంతేజార్ గంజ్ పోలీసులు. చిన్నారులను, వృద్ధులను భుజాల మీద ఎత్తుకొని బయటికి తీసుకొచ్చారు. కానిస్టేబుల్ ఉస్మాన్ కాలుకు గాయమై తీవ్రంగా రక్త స్రావం కావడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
నగరం జలమయం
రైల్వే అండర్‌బ్రిడ్జి వద్దే కాకుండా, శివనగర్తో సహా పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు మోకాళ్ళ లోతులో ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండిపోవడంతో అవి కనిపించక, ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ పరిణామాలు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మరోసారి చాటిచెప్పాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
ఒక్క వర్షానికే మునుగుతున్న బ్రిడ్జ్
ఒక్క వర్షానికే వరంగల్ అండర్ బ్రిడ్జి నీళ్లలో మునిగిపోతుందని, నగరం నడిబొడ్డున అండర్ బ్రిడ్జి కింద నీళ్లు నిలిచి ఉంటే వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని, ఒక్కోసారి ఆ మార్గంలో వాహన రాకపోకలు ఎక్కడికి అక్కడే నిలిచి పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడితే చాలు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇటువంటి పరిస్థితి ఉంటుందని వారు అంటున్నారు.