రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుందని చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభా వంతో వర్షాలు కురవనున్నాయని అధి కారులు తెలిపారు.
వడగండ్ల వాన కురవనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరాత్వాడ మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో అదే ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మరాత్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణీ మంగళవారం దక్షిణ ఛత్తీస్ గడ్ నుండి మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు అదే ఎత్తులో కొన సాగుతోందని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. వర్షాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుండి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.