REVANTH: బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటోంది బీజేపీనే: రేవంత్
బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. బహుజనులకు 42% రిజర్వేషన్ల కోసం 2 చట్టాలు కేంద్రానికి;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ప్రసంగిస్తూ, బహుజనులకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రెండు వేర్వేరు చట్టాలను రూపొందించి కేంద్రానికి పంపామని తెలిపారు. కానీ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆమోదించకపోవడం బహుజనులపై తీవ్రమైన అన్యాయం అవుతుందని ఆరోపించారు. కులగణన ఆధారంగా బహుజనుల సంఖ్య 56.33 శాతం ఉన్నప్పటికీ, వారికి సరిపడిన రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది మోదీ ప్రభుత్వం, కిషన్ రెడ్డి అని విమర్శించారు. గతంలో కేసీఆర్ తీసుకువచ్చిన చట్టం బీసీలకు శాపంగా మారిందని, అందుకే కొత్త చట్టాన్ని ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్‌కు పంపితే, గవర్నర్ రాష్ట్రపతికి పంపారని చెప్పారు. ఐదు నెలలు గడిచినా బిల్లులు ఆమోదం పొందలేదని, అందుకే ఢిల్లీలో ధర్నా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ రాకపోవడం బహుజనుల పట్ల వారి వైఖరిని చూపుతుందని మండిపడ్డారు.
మతం ముసుగులో రిజర్వేషన్లు అడ్డుకోవడం తప్పు అని, నాగ్‌పూర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బీసీ ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేయగలరా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను శిలాశాసనమని పేర్కొన్నారు. బహుజనుల సామ్రాజ్యం కోసం, వారి ఆకాంక్షల సాధన కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. విద్య, ఉద్యోగాల ద్వారా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్లడం తమ బాధ్యత అని అన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో కోటి ఓట్లు అక్రమంగా నమోదు చేశారని, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని చెప్పారు. ఓటు హక్కును దోచుకున్న వారిని శిక్షించాలనే డిమాండ్‌తో రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు తాను, డిప్యూటీ సీఎం త్వరలో మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఓట్ల చోరీ చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.