చెదురుమొదురు వర్షాలతో కాసింత వాతావరణం చల్ల బడినా రెండు రోజులుగా సూర్యుడి ప్రతాపానికి ఎండలు మండిపోతున్నా యి. సాధారణంగా వేసవికాలం చివరలో మే చివరి వారంలో నమోదు కావాల్సిన 45డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు ఏప్రిల్ చివరి వారంలోనూ నమోద వుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండిపోయాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు సతమతమయ్యారు. నిజామాబాబాద్లో 45.3 డిగ్రీలు, ఆదిలాబాద్లో 45.2 డిగ్రీలు, మంచిర్యాలలో 45 డిగ్రీలు, హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై డేంజర్ బెల్స్ మోగించాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న మూడు రోజులపాటు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప పగటు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వడ దెబ్బ ప్రభావంతో మరణాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగా జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండనుందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు వీయనున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ల్న జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.