Sigachi Company : పాశమైలారం ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సిగాచీ కంపెనీ భారీ విరాళం
పటాన్ చెరు మండలం పాశమైలారంలో జరిగిన సిగాచీ కంపెనీ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 40 మంది మరణించగా.. సుమారు 33మంది తీవ్రంగా గాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి.. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఇదే సమయంలో సిగాచీ యాజమాన్యం మండిపడ్డారు. ప్రమాదం జరిగినా ఇంతవరకు ఎందుకు స్పందించలేదంటూ ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. దీనికి సంబంధించి ఒక లేఖను విడుదల చేసింది. ప్రమాదం జరగడం బాధాకరమని.. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారి వైద్య ఖర్చులతో పాటు వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపింది. 35 ఏళ్లుగా కంపెనీని నడిపిస్తున్నామని.. ఎప్పుడూ ఎటువంటి ప్రమాదం జరగలేదని సంస్థ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపింది. అయితే రియాక్టర్ పేలి ఈ ప్రమాదం జరగలేదని.. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది.