Revanth Reddy : ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు
హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదన్న రేవంత్‌రెడ్డి... తాను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదన్న సీఎం;
పర్యావరణ పునరుజ్జీవం కోసమే హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీ.. పబ్లిక్‌సిటీగా మారడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. కేరళ పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదని రేవంత్ అన్నారు. హైడ్రా ఏర్పాటు వెనుక రాజకీయ కోణం, కుట్ర లేదని తేల్చి చెప్పారు. కొంతమంది ల్యాండ్ మాఫియా వాళ్లు పేదలను ముందుపెట్టి హైడ్రాను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు. తాను ఫామ్‌హౌస్ సీఎంని కాదని.. పని చేసే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు. గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగిందన్నారు. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.
ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం
గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని... ప్రతినెలా అసలు, వడ్డీ కలిపి రూ.6 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేయడాన్ని ఒక సవాల్‌గా స్వీకరించామని ముఖ్యమంత్రి తెలిపారు. అప్పుల పునర్ వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తున్నాం. కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసాను తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ విషయమై తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి.. ప్రధాని సహా కేంద్ర మంత్రులందరికీ వినతిపత్రాలు ఇస్తున్నాని.. తన పర్యటనల మీద విమర్శలు చేస్తున్నారన్నారు. కాలు కదపకుండా ఇంట్లో సేదదీరడానికి నేనేమీ ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదన్నారు.
తెలంగాణ నుంచి మనం పన్నుల రూపంలో కొన్ని వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. అందులో మన వాటా తిరిగి తెచ్చుకోవడం మనహక్కు. అందుకోసం ఎన్నిసార్ల్లైనా ఢిల్లీకి వెళ్తానని సీఎం స్పష్టంచేశారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి, యువ వికాసానికి, మహిళా స్వావలంబనకు, రైతు సంక్షేమానికి, బడుగు బలహీనవర్గాల సామాజిక, ఆర్థిక ఉన్నతికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.