Budget 2022: ఫిబ్రవరి 1న బడ్జెట్.. తెలంగాణకు భారీ స్థాయిలో కేటాయింపులు.!
Budget 2022: ఎన్నికల లైన్‌లో వస్తున్న ఈ బడ్జెట్‌ను.. అన్ని రాష్ట్రాలు నిశితంగా చూస్తున్నాయి.;
Budget 2022: ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎన్నికల లైన్‌లో వస్తున్న ఈ బడ్జెట్‌ను.. అన్ని రాష్ట్రాలు నిశితంగా చూస్తున్నాయి. ప్రతీ ఏటా సామాన్యుడికి ట్యాక్స్ ఊరట ఎంత అన్నదానిపై చర్చ ఉండేది. బడ్జెట్ తర్వాత అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడిచేది. బీజేపీ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించేవారు టీఆర్‌ఎస్ నేతలు.
అయితే ఈసారి ఈ సీన్ రాకుండా చూస్తున్నట్లు కనిపిస్తోంది. కచ్చితంగా ఈసారి తెలంగాణకు భారీ స్థాయిలో కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలూ ఇదే అంటున్నారు. ఇంతకు ఈ మార్పుకు కారణం ఏంటి.? తెలంగాణ విషయంలో బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టడానికి రీజన్ ఏంటి.? తెలంగాణలో ఇప్పటికే రాజకీయం హీటెక్కింది.
సాధారణ ఎన్నికలకు రెండేళ్లు గడువు ఉన్నా.. అప్పటికి వరకు ఆగే పరిస్థితుల్లో పార్టీలు లేనట్టే కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తామే పైచేయి సాధించాలని ఇప్పటి నుంచే కత్తులు నూరుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ వంటి ప్రాజెక్ట్‌లను ఆపేసిందని.. బీజేపీ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తోంది టీఆర్‌ఎస్.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయని.. ప్రాజెక్ట్‌లు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని బీజేపీ నేతలూ ఎదురుదాడి చేస్తున్నారు. కేంద్రం నిధులను దారిమళ్లించి ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజెక్ట్‌లు కేటాయించి.. రాష్ట్ర ప్రభుత్వంపై అప్పర్ హ్యాండ్ సాధించాలనే వ్యూహంతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
2023 ఎన్నికలే టార్గెట్‌గా ఈఏడాది బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు ఉండేలా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం. తాము రాజకీయం కోసం కాదని రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని.. ప్రజలకు చెప్పేప్రయత్నం చేయబోతున్నారు నేతలు. దీనికి తగ్గట్టుగానే ఎప్పుడూ లేనివిధంగా.. రాష్ట్ర బీజేపీ నేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్.
తెలంగాణ అవసరాలు, ఏం ఏం కేటాయిస్తే ప్రజలను ఆకట్టుకోవచ్చు అన్న యాంగిల్‌లో చర్చించారు. రాష్ట్రానికి రైల్వే లైన్లు, జాతీయ రహదారులు కేటాయించడంతో పాటు.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను కేటాయించాలని రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న ధాన్యం కొనుగోళ్ల డిమాండ్‌కు చెక్ పెట్టేలా.. 3వేల బాయిల్డ్ రైస్ మిల్లులను అప్ గ్రేడ్ చేయాలని, ఫిషరీ, మీట్ సెంటర్లకు నిధులు ఇవ్వాలని, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు.
ఎయిమ్స్‌కు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో అదనంగా మరో నవోదయ పాఠశాల నిర్మించాలని.. నిరాధరణకు గురవుతున్న 50 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడంతోపాటు.. పోచంపల్లి తరహాలో గద్వాల, నారాయణపేట, దుబ్బాకలలో హ్యాండ్లూమ్ క్లస్టర్ల ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
నాగార్జుసాగర్‌లో బుద్దిస్ట్ సర్క్యూట్, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధి అంశంపైనా నేతలు చర్చించారు. రైతులు పంటలను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేసుకునేలా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. మొత్తంగా రాజకీయంగానే కాకుండా.. అభివృద్ధి పరంగాను టీఆర్‌ఎస్‌ను డామినేట్ చేయాలన్న వ్యూహంతో బీజేపీలు వ్యూహాలు రచిస్తోంది. కేంద్రం నేతలే రంగంలోకి దిగి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో.. మున్ముందు ఫైట్ మరింత్ టఫ్‌గా మారేలా కనిపిస్తోంది.