National Turmeric Board: పసుపు బోర్డు ఏర్పాటుపై హర్షాతిరేకాలు
స్వాగతించిన అన్ని పార్టీల నేతలు.. సాకారమైన రైతుల పోరాటం;
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులకు సంక్రాంతి కానుకగా పసుపు బోర్డును కేంద్రం ప్రారంభిస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయని వెల్లడించారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. పసుపు బోర్డును నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు దఫాలు ప్రధానికి లేఖలు రాశామని, ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి విన్నవించామని చెప్పారు.
హర్షణీయమన్న కోదండరెడ్డి
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. దీనికోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని కేటాయించిందని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు ఆధారిత పరిశ్రమలను వెంటనే ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని, పసుపు రైతులకు లాభం కలిగేలా చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు.
రైతుల పోరాటంతోనే...
పసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ధర్మపురి అర్వింద్ తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది. ఎంపీ హామీ నెరవేరినట్లయింది.