Telangana : మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విధానాల్లో మార్పు అవసరమే..!

Update: 2026-01-19 05:01 GMT

తెలంగాణలో త్వరలోనే 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినా.. మున్సిపల్ పాలకవర్గాలకు నిజమైన అధికారాలు లేవన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిర్ణయాధికారాలు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్ల చేతుల్లో లేవన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పాలకవర్గాలు నిధుల విషయంలో పూర్తిగా ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు నేరుగా స్థానిక సంస్థలకు కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా వెళ్లడం వల్ల.. అభివృద్ధి పనులు ఆలస్యం అవుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం అభివృద్ధి నిధుల విషయంలో ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఇస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. స్థానిక సమస్యలు ఏవో.. వాటికి ప్రాధాన్యత ఏంటో మున్సిపల్ పాలకవర్గాలకు బాగా తెలిసినా.. నిధులు వారి చేతిలో లేకపోవడం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లకు నేరుగా నిధులు ఇస్తే.. ఆ డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలో వారు బాగా నిర్ణయించగలరని ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు, బాధ్యతలు ఒకే దారిలో ఉండాలని రాజ్యాంగం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు జరిగితే సరిపోదు.. పాలకవర్గాలకు పని చేసే శక్తి ఇవ్వాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాబట్టి ఇక నుంచైనా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల తలరాతను మార్చాలని ఆశావహులు కోరుతున్నారు. నిధులు నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి వస్తే.. అభివృద్ధి వేగం పెరుగుతుందని, ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News