రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు పాలక మండళ్లు నియమించేందుకు టీపీసీసీ అధిష్టానం యోచిస్తోంది. కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల నియామకం మరికొంత ఆలస్యం అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన ఆలయాల చైర్మన్ పదవులకోసం సుమారు 200 వందల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.
కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు సన్నగిల్లడంతో ఆలయాల కమిటీల పై టీపీసీసీ దృష్టి సారించింది. అయితే ఇప్పటికే ప్రకటించిన 37 కార్పొరేషన్లను పునర్ పరిశీలించేందుకు టీపీసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాసు మున్షి జిల్లా మంత్రులు అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అభిప్రాయాల సేకరణ అనంతరం సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ప్రకటించిన 37 కార్పొరేషన్లతో పాటు మిగతా 23 కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించే ఆలోచనలో కూడా టీపీసీసీ ఉంది. అలాగే మరో 9 కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
నూతనంగా ఏర్పడే కార్పొరేషన్లపై శాసనసభలో చర్చించిన అనంతరం ప్రభుత్వం ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్ చైర్మన్లల నియామ కం ఆలస్యం అవుతుండటంతో ఆలోగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ యోచిస్తోంది. దేవాల యాల పాలకమండలి చైర్మన్ తో పాటుగా పూర్తి స్తాయి పాలకమండళ్లను ఏర్పాటు చేస్తే కింది స్థాయి కాంగ్రెస్ నాయకులకు పదవులు లభించే అవకాశాలున్నాయని టీపీసీసీ భావిస్తోంది.