యునైటెడ్ బ్రూవరీస్ చెప్పినట్లు బీర్ల ధరలు 33 శాతం పెంచితే వినియోగదారులపై భారం పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘ధరల పెంపు కోసం ఓ కమిటీ వేశాం. కమిటీ సూచనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. బీర్ల మార్కెట్‌లో యునైటెడ్ బ్రూవరీస్ గుత్తాధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆ కంపెనీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని ఆయన వివరించారు.
రాష్ట్రంలోకి లోకల్ బ్రాండ్స్ బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అందుకే కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్ల సరఫరా నిలిపివేసిందని సర్కార్‌పై మండిపడ్డారు. ‘బీర్ల నిలిపివేతపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వీటి సరఫరాను నిలిపేశారు. యునైటెడ్ బ్రూవరీస్ కు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణకు కింగ్‌ఫిషర్ సహా బీర్ల సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. తెలంగాణ నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్‌ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.