ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చు పై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అమలుకు సపోర్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల్లో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం అమలుపై సెస్ ఇప్పటి వరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు