10 రోజులుగా అడవిని జల్లెడపడుతున్నా కనిపించని పులి జాడ

Update: 2020-11-21 05:17 GMT

అడవులు తగ్గిపోతుండటం... ఆహారం దొరక్కపోవడం... కారణమేదైనా.. వన్యంలో ఉండాల్సిన పెద్ద పులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. గత 10 రోజులుగా... కొమరంభీం జిల్లాలో ఓ యువకుడిని చంపిన పులి ఆచూకీ కనుగొనేందుకు అటవీశాఖ అధికారులు అడవిని జల్లెడపడుతున్నారు. 40 మంది ఫారెస్ట్‌ సిబ్బంది రంగంలోకి దిగి దహేగం అడవుల్లో పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు. పులి సంచరించే ప్రాంతంలో 4 బోన్లను ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. పులి భయంతో వణికిపోతోన్న స్థానికులు తమకు రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు.

తాజాగా... బెజ్జూరు మండలంలోని అంబగట్టు బీట్‌ అటవీ ప్రాంతంలోకి కుకుడ గ్రామానికి చెందిన ఇద్దరు మేకలు తోలుకుని అడవికి వెళ్లారు. కొద్దిసేపటికే మేకలు బెదిరిపోవడంతో... ఏం జరిగిందోనని చూసినవారిని చెమలు పట్టాయి. ఎదురుగా పెద్దపులి కనిపించిందని వారు చెబుతున్నారు. దీంతో తీవ్రంగా భయపడ్డ వారు.. దగ్గర్లోని ఓ చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు.

Tags:    

Similar News