TS: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
కాళేశ్వరం కమిషన్ నివేదికే ఎజెండా.. సభ ముందుకు రానున్న జస్టిస్ ఘోష్ నివేదిక... ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎంపిక
నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభతోపాటు శాసనమండలి సమావేశాలు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇవాళే తెలంగాణ మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు శాసనసభలోని కమిటీ హాల్లో క్యాబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో.. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో వివిధ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిశీలించి తదుపరి అడుగు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగలేదు. స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ల ఆధ్వర్యంలోనే శాసనసభ నడుస్తోంది. అయితే ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్‌ను డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి.
వాడివేడిగా చర్చలు
ఇటీవల ఆకస్మికంగా మరణించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు.. సమావేశాల తొలి రోజే అసెంబ్లీలో సంతాపం ప్రకటించనున్నారు. సభలోని ఎమ్మెల్యేలందరికీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు 600 పేజీలకు పైగా ఉంది. ఈ ఈ రిపోర్టును సభ్యులందరికీ అందజేసి.. పూర్తి స్థాయిలో చర్చించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చర్చల తర్వాత.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశాలు వాడీ వేడిగా జరగనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం నివేదిక పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ర్టంలో వివాదస్పదంగా మారిన మార్వాడీ గోబ్యాక్ అంశాన్ని బీజేపీ శాసనసభలో లేవనెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజల దృష్టిని మరల్చందుకే ఈ నినాదాన్ని కావాలనే ఆ పార్టీ క్రియేట్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.