VaddeRaju : రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు నేడు నామినేషన్

Update: 2024-02-15 05:08 GMT

బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కేసీఆర్ ఖరారు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ లీడర్లను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 2022లో వద్దిరాజును రాజ్యసభకు నామినేట్ చేశారు.

ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2న ముగియనుంది. కాగా వద్దిరాజుకు వరుసగా రెండోసారి రాజ్యసభ అవకాశం కల్పించారు. మొదటి దఫాలో రవిచంద్ర రెండేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.

బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న వద్దిరాజుతో పాటు సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుంది. అసెంబ్లీలో సభ్యుల సంఖ్యాబలాన్ని బట్టి రెండు సీట్లు కాంగ్రెస్​కు, బీఆర్ఎస్​కు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా, బీఆర్ఎస్ ఒకరి పేరు అనౌన్స్ చేసింది. దీంతో మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులే నామినేషన్​లు వేయనున్నారు. నామినేషన్​ల దాఖలుకు గురువారమే ఆఖరు కావడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News