సెప్టెంబర్‌లో పెరగనున్న ఉల్లిపాయల ధరలు

Update: 2023-08-05 09:14 GMT

గత రెండు నెలలుగా టమాట ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో టమాట రూ.250 దాటింది. పచ్చిమిర్చి కూడా సెంచరీ దాటింది. త్వరలో ఉల్లిపాయల ధరలు కూడా అదే దారిలో వెళ్లబోతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లిపాయల ధరలు రీటైల్ మార్కెట్‌లో రూ.30 గా ఉన్నాయి. సెప్టెంబర్ మొదటివారంలో ఉల్లిపాయల ధరలు రూ.60-రూ.70 కి చేరుకుంటాయని క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ రిపోర్ట్ వెల్లడించింది.

సరఫరాలో కొరత ఏర్పడటం వల్ల ధరలు పెరుగుతాయని అభిప్రాయపడింది. అయితే అక్టోబర్‌లో సరఫరా మళ్లీ మామూలు స్థితికి వస్తుందని, ధరలు కూడా తగ్గుతాయని క్రిసిల్ వెల్లడించింది. సాధారణంగా మార్చిలో మార్కెట్‌కు వచ్చే రబీ పంటను ముందుగానే కోసి ఫిబ్రవరిలో అందుబాటులోకి తీసుకురావడంతో ఖరీఫ్ పంట ఆలస్యమైనా సరఫరా కొనసాగింది. దీంతో మార్కెట్‌కు గిట్టుబాటు అయింది. అయితే రబీ స్టాక్ సాధారణంగా సెప్టెంబర్ చివరి వరకు డిమాండ్‌ను తీర్చడానికి నిల్వ చేయబడుతుంది. ఆ తర్వాత ఖరీఫ్ పంట అందుబాటులోకి వస్తుంది.

అయితే, రబీ ఉల్లిపాయల సెల్ఫ్ లైఫ్ తగ్గడం, ఫిబ్రవరి-మార్చిలో అమ్మకాల భయాందోళనల కారణంగా, సప్లై-డిమాండ్‌లో అసమతుల్యత వచ్చింది. ఈ ప్రభావంతో ఆగస్టు చివరి నాటికి ఉల్లి ధరల్లో పెరుగుదల ప్రారంభం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది.

Tags:    

Similar News