Bhatti Vikramarka : గ్రీన్ ఎనర్జీలో లీడర్ గా నిలపాలి : మల్లు భట్టి విక్రమార్క
గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను లీడర్ గా నిలపాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతోందని, భూగర్భ జలవనరులు పెరిగాయని చెప్పారు. తెలంగాణ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలు అని అన్నారు. ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లను క్రమంగా సోలార్ పంపు సెట్లుగా మార్చడంపై దృష్టి పెట్టాలని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహానికి బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. రాయితీలు కల్పిస్తూ రైతులను భాగస్వాములు చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. బ్యాంకర్లు లోన్లు తిరిగి చెల్లించాలంటూ రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఏడాది కాకుంటే మరో ఏడాదైనా తిరిగి చెల్లిస్తారని చెప్పారు. బ్యాంకులకు వచ్చే రైతులను గౌరవించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.