తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపైనే ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ అంటోంది. కానీ చట్టపరంగా చూస్తే అది సాధ్యం అయ్యేలా కనిపించట్లేదు. ఇప్పటికే హైకోర్టులో ఎన్నికల నోటిఫికేషన్ మీద స్టే వచ్చింది. అటు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇంకోవైపు బీసీ సంఘాలు రేపు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి. కాబట్టి ఇలాంటి టైమ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు వచ్చేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పుడు పాత పద్ధతిలోనే వెళ్లి ఎన్నికలు పెట్టాలని కోర్టులు సూచిస్తున్నాయి.
కానీ పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తే పరువుపోతుందేమో.. బీసీ సంఘాల నుంచి ఒత్తిడి వస్తుందేమో అని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలు పెట్టింది. అఖిలపక్షం వెళ్తే కేంద్రం వద్ద బిల్ పాస్ అవుతుందనేది కాంగ్రెస్ ప్లాన్. కానీ కేంద్రం అంత ఈజీగా తెలంగాణలో ఈ బీసీ రిజర్వేషన్లు పెంచలేదు కదా. అప్పుడు దేశ వ్యాప్తంగా ఈ సమస్య వస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీల రిజర్వేషన్ల అంశం పెద్ద పంచాయితీ అవుతుంది. దాన్ని కేంద్రం పరిష్కరించడం సాధ్యం కాదు. కాబట్టి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం రావడం కష్టమే. కానీ కాంగ్రెస్ మాత్రం వెనక్కు తగ్గట్లేదు.
ఈ నెల 23న మరోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. అందులో అఖిలపక్షంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదంతా చూస్తుంటే స్థానిక ఎన్నికలు మరింత లేట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయడం.. ఆ తర్వాత కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే చాలా లేట్ ప్రాసెస్. కాబట్టి స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటున్నారు. పాత పద్ధతిలో పెట్టే ఆప్షన్ ఉన్నా సరే అఖిలపక్షం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం లేట్ చేస్తోంది. చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసిన తర్వాతే పాత పద్ధతికి వెళ్లేలా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. బీజేపీ మాత్రం మేమేం చేయలేమని చెబుతోంది. ఎటొచ్చి కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించినా, ఫలించకపోయినా స్థానిక ఎన్నికలు ఇప్పట్లో కష్టమే.