Maharashtra Minister : అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రి.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రి శాఖను మార్చి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై ఆరోపణలు వచ్చాయి. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో మాణిక్ రావ్‌పై ప్రభుత్వం వేటు వేయకుండా క్రీడల శాఖను అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి అర్ధరాత్రి ఓ ప్రకటన జారీ అయ్యింది. ఇప్పటివరకు మాణిక్ రావ్ కోకాటే వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా.. తాజాగా ఆ బాధ్యతలను ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణెకు అప్పగించారు. కోకాటేకు క్రీడలు, యువజన సంక్షేమ మంత్రిత్వశాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖను దత్తాత్రేయ పర్యవేక్షించారు. వివాదాస్పదమైన చర్యలకు పాల్పడే మంత్రులపై తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలిచ్చేందుకే ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
మంత్రిని తొలిగించాల్సింది పోయి కేవలం శాఖలనే మారుస్తారా అని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది జవాబుదారీతనం అనిపించుకోదని..కేవలం కంటితుడుపు చర్య అని శివసేన యూబీటీ నేతలు ఆరోపించారు. క్రీడల శాఖను అప్పగించడం అంటే.. అసెంబ్లీలో రమ్మీ ఆడటాన్ని అధికారికంగా అనుమతించినట్లే అవుతుందని విమర్శలు గుప్పించారు.