ఆస్ట్రేలియాను వణికిస్తున్న వరదలు.. 60 ఏళ్లలో ఇదే తొలిసారి

ఈ నదికి 1961 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం.

Update: 2021-03-24 03:00 GMT

ఆస్ట్రేలియాను వరదలు వణికిస్తున్నాయి. తూర్పుతీర ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రస్తుతానికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా...నదులు ఇంకా ప్రమాదకర స్థితిలోనే ప్రవహిస్తున్నాయి. అటు విరిగిపడిన చెట్లు, నీటమునిగిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లుతో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఈ స్థాయిలో వరదలు రావడం 60 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. దేశ రాజధాని సిడ్నీతోపాటు దానికి ఆనుకుని ఉన్న న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రాలు వరద దాటికి విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే సిడ్ని, న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్ ల్యాండ్ నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కుండపోతగా కురుస్తున్న వర్షాలతో సిడ్నిలోని హాక్స్‌బెర్రీ, నేపియన్ నదులు ఉగ్రరూపం దాల్చాయి. నేపియన్ నది అయితే దాని సాధారణ ప్రవాహస్థితి కంటే 13 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. ఈ నదికి 1961 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం. వరదలు, కుండపోతల వర్షాలు కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిలిపివేశారు. విమానాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వరద బీభత్సంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పందించారు. సిడ్ని రెడియో స్టేషన్ వేదికగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది దేశానికి మరో పరీక్షా సమయమని అన్నారు. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం హెచ్చరించింది.



Tags:    

Similar News