H-1B Visa : ట్రంప్ విధించిన H-1B ఫీజుకు భారతీయ కంపెనీలు కౌంటర్.. కొత్త వీసా వ్యూహాలతో సిద్ధం.

Update: 2025-10-06 06:00 GMT

H-1B Visa : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం భారతీయ టెక్ ఇండస్ట్రీ పై పెను ప్రభావం చూపనుంది. H-1B వీసా కోసం కొత్త దరఖాస్తులపై ఫీజును ఏకంగా 100,000 డాలర్లు (మన కరెన్సీలో రూ.88 లక్షలు)కి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాలు చేసే భారతీయ నైపుణ్యం గల కార్మికులపై పెద్ద భారం పడనుంది. అయితే, ఈ భారీ వీసా ఫీజు భారం నుంచి తప్పించుకోవడానికి భారతీయ కంపెనీలు కూడా కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. కంపెనీలు తమ అమెరికన్ స్టాఫింగ్ పద్ధతులను మార్చుకుంటూ, ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నాయి.

ట్రంప్ ప్రభుత్వం H-1B వీసాపై ఏకంగా 100,000 డాలర్ల (రూ.88 లక్షలు) ఏకమొత్తం ఫీజును విధించడంతో, భారతీయ కంపెనీలు ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కంపెనీలు ఇప్పుడు

L-1 వీసా (ఇంట్రా-కంపెనీ బదిలీ): ఉద్యోగులను సంస్థ లోపలే ఒక దేశం నుంచి మరొక దేశానికి బదిలీ చేయడం.

B-1 వీసా (వ్యాపార వీసా): సమావేశాలు, చిన్నపాటి పనుల కోసం ఉద్యోగులను పంపడం.

ఆఫ్‌షోరింగ్: అమెరికాలో చేయాల్సిన పనిని యూరప్‌లోని అనుకూల దేశాలకు లేదా తిరిగి భారత్‌కు బదిలీ చేయడం వంటి వ్యూహాలపై దృష్టి పెడుతున్నాయి.

ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త H-1B వీసా ఫీజును సెప్టెంబర్ 19న ప్రకటించి, సెప్టెంబర్ 21 నుంచే అమలులోకి తెచ్చింది. అయితే, అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఒక రోజు తర్వాత స్పష్టత ఇచ్చింది. ఈ భారీ ఫీజు కేవలం కొత్తగా దాఖలు చేసే వీసా పిటిషన్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే అమలులో ఉన్న వీసాలపై దీని ప్రభావం ఉండదని తెలిపారు.

ఈ అకస్మాత్తుగా పెరిగిన H-1B వీసా ఫీజుల కారణంగా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో కంపెనీల టాలెంట్, అవుట్‌సోర్సింగ్ ప్రణాళికలలో పెద్ద మార్పులు రావచ్చని ఇమ్మిగ్రేషన్ నిపుణులు భావిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ నిపుణురాలు సుకన్య రామన్ ప్రకారం.. చిన్నపాటి లేదా తక్కువ కాలం పనుల కోసం కంపెనీలు ఇప్పుడు L-1, B-1 వీసాల వైపు చూస్తున్నాయి. అలాగే, అమెరికాలో వీసా అనిశ్చితిని ఎదుర్కొంటున్న ఉద్యోగులను, వీసా నిబంధనలు అనుకూలంగా ఉన్న యూరప్ వంటి దేశాలకు తరలించే ప్లాన్‌లు కూడా చేస్తున్నాయి.

ఆఫ్-షోర్ కంపెనీలు ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి L-1 వీసాకు అర్హత సాధించగలిగే ఉద్యోగులను గుర్తించే పనిలో ఉన్నాయి. L-1 వీసా కోసం, ఉద్యోగి కంపెనీ విదేశీ విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి. కంపెనీలు H-1B తో పాటు L-1 వీసాలను గతంలో కూడా ఉపయోగించేవి. కానీ, ఈ కొత్త భారీ ఫీజు కారణంగా ఇప్పుడు L-1, ఇతర ప్రత్యామ్నాయాలపై మరింత దృష్టి పెడుతున్నాయి.

Tags:    

Similar News