ప్రసిద్ధ ముస్లిం ప్రార్థన స్థలం మక్కాను భారీ వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. క్లాడ్ బరస్ట్ తో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం చెరువులా మారింది. పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. బలమైన ఈదురుగాలుల కారణంగా చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. మక్కా, మదీన, జెడ్దాలో భారీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులు, సుడిగాలులు ఆ ప్రాంతాల్లో విలయం సృష్టించాయి.
రెండు రోజులుగా కురిసిన వర్షంతో రియాద్, మక్కా, అల్-బాహా, తబుక్‌తో సహా ఇతర ప్రాంతాలు దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సౌదీ అరేబియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
మక్కా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బంది పడ్డారు. మక్కాకు దక్షిణాన ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు... ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదనీటిలో బైక్ తో పాటు చిక్కుకున్న డెలవరీ బాయ్ ను స్థానికులు రక్షించారు. ఊహించని విధంగా వరదనీరు ప్రవహించడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మక్కా, మదీన, జెడ్దాలో చాలా ప్రాంతాలు వర్షంతో దెబ్బతిన్నాయి.